తెలుగు పలుకు ఆస్ట్రేలియా – సిడ్నీ:
గ్లెన్‌వుడ్‌లోని ఆల్విన్ రిజర్వ్‌లో నిర్వహించిన ATSA ఫిట్‌నెస్ ఈవెంట్ 2025 శనివారం విజయవంతంగా ముగిసింది. చాలా మంది ఉత్సాహంగా హాజరైన ఈ కార్యక్రమంలో ప్రముఖ నిపుణులు ఆరోగ్య సూత్రాలను పంచుకున్నారు.
ప్రముఖ డాక్టర్ ఈశ్వర్ మాదాస్ గారు సరైన శరీర నడక విధానాల గురించి ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఆధునిక జీవన శైలిలో కనిపించే సాధారణ పొరపాట్లను ఎత్తి చూపుతూ, వాటిని సరిదిద్దుకునే మార్గాలను వివరించారు.
ఫిజియోథెరపిస్ట్ గ్యారీ గారు ఇంట్లోనే చేసుకోగలిగే సులభమైన వ్యాయామాలను ప్రదర్శించారు. ప్రత్యేకించి కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడిపే వారికి ఉపయోగపడే వ్యాయామాలపై దృష్టి సారించారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుండి వచ్చిన లావణ్య గొర్రెపాటి గారు ఒత్తిడి నియంత్రణ, ధ్యానం గురించి , ఆధునిక జీవితంలో మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను గురించి
చెప్పడం తో పాటు అక్కడున్న వాళ్ళందరితో ప్రాణాయామం, ధ్యానం చేయించడం జరిగింది.
న్యూ ఎరా ఆర్గనైజేషన్ జీవన్ రెడ్డి గారు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలతో సహా అన్ని వయసుల వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆరోగ్యకరమైన అల్పాహారం ATSA కమిటీ అందజేశారు.
ఆదివారం ఉదయం పార్క్ లో జరిగిన ఈ ఈవెంట్ ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ మరింత పెంచుతుంది అనడం లో ఏ సందేహం లేదు అని ATSA కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమం ఆస్ట్రేలియాలోని తెలుగు సమాజంలో ఆరోగ్య అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని కూడా తెలిపారు.
— అవినాష్ అడ్లూరి









































