తెలుగు పలుకు ఆస్ట్రేలియా – సిడ్నీ:
ఎన్టీఆర్.. నిద్రాణమై ఉనికి కోల్పోతున్న తెలుగుజాతిని వెన్నుతట్టి లేపి జవసత్వాలనిచ్చిన మహనీయుడు. నటుడు, నిర్మాత, దర్శకుడు, నాయకుడు, ప్రతినాయకుడు, మహానాయకుడు, చిత్రకారుడు. చిత్రజీవితంలోనే కాదు, నిజజీవితంలోనూ ఇన్ని పాత్రలు పోషించి, శాసించి, భాసించిన ప్రభంజనుడు. రాజకీయాలు ప్రజాహితం కోసమే అని నినదించి సమాజాన్ని దేవాలయంగా భావించి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసిన ప్రజాసేవకుడు అన్న శ్రీ నందమూరి. ఆస్ట్రేలియాలో సిడ్నీ నగర తెలుగు ప్రజానీకం కూడా ఆ కారణజన్ముడి 101వ జయంతి వేడుకలను జూన్ 16న ఘనంగా జరుపుకుంది.
తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కేవలం సిడ్నీ నుండే కాకుండా కాన్బెర్రా, న్యూ క్యాజిల్ నగరాల నుండి కూడా తెలుగువారు భారీగా తరలివచ్చి ఆ పుణ్యపురుషుని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం సీనియర్ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఆరుగంటలు ఏకధాటిగా జరిగిన ఈ వేడుకలలో అనేక మంది చిన్నారులు, పెద్దలు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆహూతులను ఆద్యంతం అలరించారు. వేడుకకి హాజరైనవారికి తెలుగింటి వంటకాలతో పసందైన విందు ఏర్పాట్లు చేసారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి విజయఢంకా మోగించి చంద్రబాబు మరొక్కసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన నేపథ్యంలో విజయోత్సవాలు కూడా ఘనంగా జరుపుకున్నారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కటౌట్లతో ఏర్పాటు చేసిన ఫోటోబూత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ముఖ్య అతిథి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ చేసిన సేవలను, ముఖ్యమంత్రిగా చేపట్టిన సంస్కరణలను గుర్తు చేస్తూ ఎన్టీఆర్ లాంటి మహోన్నత మనిషి, నిస్వార్ధ నాయకుడు యుగానికి ఒక్కరే ఉంటారని, అయన తెలుగు జాతికే కాకుండా యావత్ భారతదేశానికే గర్వకారణం అని కొనియాడారు. ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుభవాలను అందరితో పంచుకున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు రహస్య విప్లవం ద్వారా జగన్ రాక్షస పాలనను అంతమొందించారని ఇది స్వతంత్ర భారతావని చరిత్రలోనే అద్భుత ప్రజాతీర్పు అని కొనియాడారు. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రము తిరిగి ప్రగతి పట్టాలెక్కింది అని అన్నారు.
తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రతినిధులు మాట్లాడుతూ ఆ మహనీయుడి జన్మదినం, తెలుగుదేశం విజయోత్సవాలు వేలమంది అభిమానుల సమక్షంలో జరుపుకోవటం గర్వంగా ఉందని, ఈ ప్రత్యేక సందర్భాన రక్తదానం చేసిన ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వేడుక సజావుగా సాగేందుకు సహకరించిన వాలంటీర్లకు కృతఙ్ఞతలు తెలిపారు.
— చక్రధర్ వేమూరి