తెలుగు పలుకు ఆస్ట్రేలియా సిడ్నీ: వాట్సాప్ గ్రూప్ లందు STG తెలుగు గ్రూప్ వేరయా అంటూ ప్రతి ఏడాది జరుపుకొనే వార్షికోత్సవం జూన్ 15 శని వారం నాడు డాన్ మూర్ కమ్యూనిటీ సెంటర్ , కార్లింగ్ ఫోర్డ్ నందు ఘనం గా జరిగింది. సమాజమే మన దేవాలయం , ఇక్కడ మనమే భక్తులము మరియు దైవాలము కూడా అనుకొంటూ తెలుగు వారంతా సంఘటితం గా జరుపుకొన్నారు. ప్రవీణ్ , విఠల్ , మాధవ్ , హేమంత్ , సూర్య , స్వాతి , నీలిమ మరియు శంకర్ ఒక కమిటి గా ఏర్పడి తెర వెనుక ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. హాల్ విషయం లో అవాంతరాలు జరిగి తేదీలు కాస్త వెనకకు జరగాల్సి వచ్చినా నిరుత్సాహ పడకుండా అందరిని కలుపుకొని పోతూ చాలా ఉత్సాహంగా జరిపారు.
పిల్లలు, పెద్దలు , జంటలు మరియు టీనేజ్ కుర్రాళ్ళు అమ్మాయిలు కలిసి చేసిన ప్రదర్శనలు అందరిని ఉర్రుతలు ఊగించాయి . ఏదో వచ్చామా చెప్పామా అన్నట్టు కాకుండా హుషారేతికిచ్చిన అనుభవశాలి యాంకర్స్ యొక్క చెణుకులు, మరియు కొత్త యువ టీనేజ్ అమ్మాయిల ముద్దు ముద్దు తెలుగు వ్యాఖ్యానం తో కూడా కార్యక్రమం చాలా రక్తి కట్టింది. దాదాపు 2 నెలల పైగా అందరు ఎంతో నిష్ఠగా ప్రాక్టీస్ లు చేసి పడ్డ శ్రమ ప్రేక్షకుల కేరింతలతో యిట్టె మరిచిపోయినట్టైంది. తెలుగు దనానికి మారుపేరు గా తయారు అయి వచ్చి , స్టేజి పై నాటి సావిత్రి నుండి నేటి శ్రీలీల వరకు అందరిని గుర్తు చేస్తూ కార్యక్రమం ఒన్స్ మోర్ లతో మారు మ్రోగి పోయింది.
నువ్వు నాకు నచ్చావ్ సినిమా లో పెళ్లి గురించి వివరిస్తూ “ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి ” అంటూ పెళ్లి లో సాగే తంతులను ఎంతో హృద్యం గా అందంగా చిత్రీకరించిన పాట అది. అలాగే ఒక కమ్యూనిటీ ఈవెంట్ ఎలా జరగాలో అంతే అందంగా వాలంటీర్స్ సహకారం తో అందరు తలా ఒక చేయి వేసి జరిగిన కార్యక్రమం స్కోఫీల్డస్ తెలుగు గ్రూప్ యొక్క కార్యక్రమం.
చివరగా ….
తెలుగెక్కడ తెలుగెక్కడ అని అరుస్తూ తెగ బాధ పడిపోతున్న పెద్దమనుషులారా , ముద్దులొలుకు పసి కూనల తెలుగు పాట నృత్యాలతో, వారి లేత భుజాలపై భాష చాలా భద్రమిక్కడ ,
ఇంగ్లీష్ యాసలతో కష్టమైనా ఇష్టపడుతూ వ్యాఖ్యాతలు గా వ్యవహరించిన యువత చేతిలో తెలుగు పరువు పదిలమిక్కడ ,
బ్రతుకే ఒక యుద్దమై , ముందు వరస సైనికులా ఖర్చులకు వెరవకుండా తెలుగు కాపాడుతాం అంటూ తల్లిదండ్రుల చేతి లో జాగ్రత్త ఇక్కడ ,
స్వంత లాభం చూసుకోకుండా సమాజ శ్రేయస్సు కొరకు మేము సైతం అంటూ ముందుకు వచ్చే చిన్న వ్యాపారుల చేతి లో సురక్షికమిక్కడ
తెలుగిక్కడ తెలుగిక్కడ , ……
ప్రవాసపు తెలుగు లోగిళ్లలో , నేటి తరం చేతి లో , వెండితెర సాక్షి గా క్షేమమిక్కడ..
— నాగ పవన్